నిధులు రాక..నిర్వహణ లేక | - | Sakshi
Sakshi News home page

నిధులు రాక..నిర్వహణ లేక

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

నిధుల

నిధులు రాక..నిర్వహణ లేక

జిల్లాలో 116 రైతు వేదికలకు రూ.4.17 కోట్లకు పైగా బకాయిలు సదుపాయాలు లేక ఇబ్బందులుపడుతున్న రైతులు

జిల్లాలోని వ్యవసాయాధికారులు (ఏఈఓ)లకు రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. రైతు వేదికలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మూడేళ్లుగా రాకపోవడంతో వాటి నిర్వహణ నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఏఈఓలే తమ సొంత డబ్బులతో వాటి నిర్వహణను కొనసాగిస్తున్నారు.

వట్‌పల్లి(అందోల్‌):

రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. 2022 సెప్టెంబర్‌ నుంచి రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదు. దీంతో రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు భారంగా మారింది. కొంతవరకు నిర్వహణకు సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించిన ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతువేదికల నుంచి కార్యకలాపాలు సాగించాలని సంకల్పించింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వ్యవసాయ విస్తరణాధికారులు రైతువేదికలో రైతులకు అందుబాటులో ఉంటూ, మిగతా సమయంలో క్షేత్రాలను సందర్శించి వారికి సలహాలివ్వాలని ఆదేశాలిచ్చింది. మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చులకు ప్రతీ నెలా రూ.9 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ 2022 సెప్టెంబరు నుంచి వీటిని విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 116 రైతు వేదికలకు సుమారుగా రూ.4.17 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సొంతంగానే భరిస్తున్న ఏఈవోలు..

వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల వేదికల్లో ఉంటూ ప్రతీ రోజూ రైతులకు సందేహాల నివృతితో పాటు సేవలను అందిస్తున్నారు. వ్యవసాయ విస్తరణతోపాటు అధికారులు కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, మైక్‌సెట్‌ వంటి సామగ్రిని ఏర్పాటు చేశారు. ప్రజోపయోగ కార్యక్రమాలు వివిధ శాఖల సమావేశాలకు వీటిని వాడుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సమావేశం తర్వాత రైతు వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారిపై పడుతోంది. ఒక కూలీని పెట్టి డబ్బులు ఇచ్చి శుభ్రం చేయిస్తున్నారు. దీంతో వీటి నిర్వహణ ఏఈవోలకు భారంగా మారుతోంది. మరోవైపు మురుగుదొడ్లు శుభ్రం చేయడానికి నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

ప్రభుత్వానికి నివేదించాం

రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రతీ నెల నిధులు రావాల్సి ఉంది. కొంత కాలంగా నిధులు విడుదల చేయకపోవడంతో రైతు వేదికల నిర్వహణలో ఏర్పడుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపించాం.

– శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

రైతు వేదికలకు మూడేళ్లకుపైగానిధులివ్వని ప్రభుత్వం

నిధులు రాక..నిర్వహణ లేక1
1/1

నిధులు రాక..నిర్వహణ లేక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement