పట్టణమెవరికో..! | - | Sakshi
Sakshi News home page

పట్టణమెవరికో..!

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

పట్టణమెవరికో..!

పట్టణమెవరికో..!

వార్‌ వన్‌సైడ్‌ కాకపోవడంతో తక్కువ ఓట్లతో గెలుపోటములు!

హోరాహోరీగా తలపడినకాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేడు మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు పార్టీల క్యాంపు రాజకీయాలు షురూ రహస్య ప్రాంతాలకు ఇరు పార్టీల అభ్యర్థుల తరలింపు

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేటితో వీడనుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీలే తప్ప భారీ ఆధిక్యతలు ఉండవని పోలింగ్‌ సరళితోనే అర్థమవుతుందంటున్నారు సెఫాలజిస్టులు. పెరిగిన ఓటింగ్‌ శాతం తమకంటే తమకేనని అన్ని రాజకీయపార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మున్సిపల్‌ పోరులో బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుగా కనిపించలేదు. అత్యధిక సీట్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య నువ్వా..నేనా..అన్నట్లుగా ఓటింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించే వారిలో అత్యధిక అభ్యర్థులకు స్వల్ప మెజారిటీలే వస్తాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 10, 20, 30లోపు ఓట్ల మెజారిటీతో గెలిచే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రానున్నాయి. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని 256 కౌన్సిలర్‌ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి..వెయ్యి ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున కౌంటింగ్‌ చేపట్టనున్నారు. దీంతో మధ్యాహ్నమే ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరికి లాభం?

జిల్లాలో పోలింగ్‌శాతం పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్‌ ఎవరికి లాభం చేస్తుందనే దానిపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే మూడో అత్యధిక పోలింగ్‌ శాతం జిన్నారంలో నమోదైంది. గడ్డపోతారంలోనూ భారీగానే పోలింగ్‌ శాతం రికార్డు అయ్యింది. పెరిగిన ఈ పోలింగ్‌ శాతం తమకే ప్రయోజనం చేకూరుతుందని ప్రధాన పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. అలాగే మహిళా ఓటింగ్‌ శాతం కూడా పెరగడంపై రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. అభ్యర్థులు తమకు ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయని లెక్కలు వేసుకున్నారు.

గెలుపుపై అన్ని పార్టీల ధీమా

ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అభివృద్ధిని చూసి మాకే ఓటేస్తారని అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు పక్కా వ్యూహాలతో ఈ ఎన్నికల్లో తలపడిన విషయం విదితమే. ఈ రెండు పార్టీలకు రెబెల్స్‌ కొంత ఇబ్బందులకు గురి చేశారు. ఇటు బీజేపీ, ఎంఐఎం కూడా మెరుగైన స్థానాలను దక్కించుకోబోతున్నామనే ధీమాతో ఉన్నాయి. కొన్ని కౌన్సిలర్‌ స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

రహస్య ప్రాంతాలకు అభ్యర్థులు..?

క్యాంపు రాజకీయాలు షురూవయ్యాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు గురువారం రాత్రి క్యాంపునకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పీఠాలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క కౌన్సిలర్‌ ఓటు కూడా ఎంతో కీలకం కానుంది. దీంతో ఈ రెండు పార్టీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. క్యాంపునకు తరలించి చైర్మన్‌ ఎన్నిక జరిగే రోజు వీరిని నేరుగా ఆయా మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులోకి తీసుకువచ్చేలా ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇప్పటికే వారిని రిసార్టులకు తరలించారు. మధ్యలో శివరాత్రి ఉండటంతో వీరిని ప్రసిద్ధ శైవక్షేత్రాలకు తరలించే అవకాశాలున్నట్లు ఆయా పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement