అంధకారంలో నిమ్జ్‌ రహదారి | - | Sakshi
Sakshi News home page

అంధకారంలో నిమ్జ్‌ రహదారి

Feb 4 2026 8:40 AM | Updated on Feb 4 2026 8:40 AM

అంధకారంలో నిమ్జ్‌ రహదారి

అంధకారంలో నిమ్జ్‌ రహదారి

ట్రయల్‌ రన్‌కే పరిమితం హుగ్గెల్లి నుంచి నిమ్జ్‌ వరకు రహదారి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

నిమ్జ్‌ రహదారి అంధకారంలో మగ్గిపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలు ట్రయల్‌ రన్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. ఫలితంగా ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

–సంగారెడ్డి జోన్‌

హీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుంది. రెండు మండలాల పరిధిలో సుమారు 17 గ్రామాల శివారులో ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపు జరుగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలకు భూములు అప్పగించగా మరికొన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు.

100 అడుగుల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం

జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెలి చౌరస్తా నుంచి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్‌ గ్రామ శివారు ప్రాజెక్టు వరకు మౌలిక వసతుల్లో భాగంగా 100 అడుగుల విస్తీర్ణంలో రహదారిని నిర్మించారు. మౌలిక వసతులు భాగంగా ప్రధానమైన రహదారిని అన్ని హంగులతో రూ.173 కోట్ల వ్యయంతో నిర్మించారు. డివైడర్‌ మధ్యలో విద్యుత్‌ లైట్లతోపాటు ఇన్‌, అవుట్‌ గేట్ల వద్ద భారీ హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.3.50 కోట్లు వెచ్చించారు. 9 కిలోమీటర్ల మేర సుమారు 360కి పైగా స్తంభాలు ఏర్పాటు చేశారు.

ట్రయల్‌ వెలుగులతోనే...

కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రోడ్డును ప్రారంభించారు. అప్పట్లోనే విద్యుత్‌ సరఫరా కోసం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ను సరఫరా చేయటం లేదు. ట్రయల్‌తోనే విద్యుత్‌ వెలుగులు సరిపెట్టి దాటవేశారని రాకపోకలు సాగించేవారు చెబుతున్నారు.

వాహనాల రద్దీ

రవాణా సౌకర్యం మెరుగుపడటంతో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుంది. మరో 15 రోజుల్లో ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఈ దారి నుంచే వస్తారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్‌ దీపాలు వెలిగేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వెలగని విద్యుత్‌ దీపాలు

చీకట్లోనే ప్రయాణం...

ఇప్పటికే భూములు కేటాయించిన పరిశ్రమల నిర్వాహకులతోపాటు అధికారులు రాకపోకలు సాగిస్తున్నారు. అంతే కాకుండా బర్దిపూర్‌, చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి, కష్ణాపూర్‌ పొట్టిపల్లి, ఝరాసంగం, మాచనూర్‌, న్యాల్‌కల్‌ మండలాలకు వెళ్లేవారు ఈ దారి గుండానే వెళ్తున్నారు. పలుచోట్ల ఉన్న మూల మలుపులు, రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి రోడ్డుపై దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనిపించక అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో రాత్రి కాగానే మధ్యలో ఉన్న బ్రిడ్జిలు మందుబాబులకు అడ్డాగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement