ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. మండలంలోని ఆరూర్ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షేర్ వాల్ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్దేశించిన రూ.5 లక్షలతోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగితే లబ్ధిదారులకు ఆర్థికభారం ఉండదని, నిబంధన ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎండీ వెంట హౌసింగ్ పీడీ చలపతిరావు, ఆర్డీవో రాజేందర్, హౌసింగ్ డీఈ మాధవరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఏఈ రేష్మ, సర్పంచ్ లావణ్య, వార్డ్ సభ్యులు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హౌసింగ్ జిల్లా పీడీ చలపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ డీఈలు, ఈఈలు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


