సాంఘికశాస్త్రం ఎంతో కీలకం
జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు
సంగారెడ్డిఎడ్యుకేషన్: సమాజాన్ని అర్థం చేసుకోడానికి సాంఘికశాస్త్రం చాలా ముఖ్యమైనదని, దానిని అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమవారం జిల్లాస్థాయి సాంఘికశాస్త్ర ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలలో పాల్గొనాలంటే సాంఘికశాస్త్ర అధ్యయనం తప్పనిసరన్నారు. ఈ పరీక్ష ద్వారా పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యున్నత స్థాయి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని, అందుకు కృషిచేస్తున్న సాంఘికశాస్త్ర ఫోరం నాయకుల కృషిని అభినందించారు. పరీక్ష లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలలో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ లింబాజి, ఏఎంఓ బాలయ్య, సీఎంఓ వెంకటేశం, ఎంఈఓ విద్యాసాగర్, సైన్స్ అధికారి సిద్దారెడ్డి, సాంఘికశాస్త్ర ఫోరం నాయకులు సునీతాఖన్నా, రాంరెడ్డి, ప్రభాకర్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.


