మర్వెళ్లిలో తుపాకీ కలకలం
● మామ ఇంట్లో అల్లుడి దొంగతనంతో విషయం బయటకు.. ● భయంతో 100కు ఫోన్‌చేసిన అల్లుడు
వట్‌పల్లి(అందోల్): మండలంలోని మర్వెళ్లిలో తుపాకీ ఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దగొల్ల విఠల్ చిన్న కూతురు అదే గ్రామానికి చెందిన సాయిగారి కిషోర్‌ను వివాహం చేసుకుంది. అయితే అల్లుడు కొంతకాలంగా మామ కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లుడు బుధవారం సాయంత్రం మామ ఇంటికి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఉన్న ఓ పెట్టెను ఎత్తుకెళ్లి చూడగా.. అందులో తుపాకీ కనిపించింది. తనను చంపడానికే అని భయపడి కిషోర్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న వట్‌పల్లి పోలీసులు శుక్రవారం మర్వెళ్లికి చేరుకొని విచారణ చేపట్టారు. కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లవకుమార్ తెలిపాడు. అయితే తుపాకీ లభించడంపై గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.


