రూ.3.30 కోట్లతో అభివృద్ధి పనులు
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
● రూ.30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్
పటాన్‌చెరు: నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు డివిజన్ సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.3.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శరవేగంగా విస్తరిస్తున్న పటాన్‌చెరు డివిజన్, జేపీ కాలనీ డివిజన్‌ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, యూజీడీలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని చోటి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గల స్థలంలో రూ.30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
రామాలయం నిర్మాణానికి విరాళం
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి రూ.75 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించిన మంచినీటి సంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.


