ఎలక్షన్.. ఫుల్ కలెక్షన్
● పన్నుల చెల్లింపుల కోసం ఎగబడిన అశావహులు
● నామినేషన్ కేంద్రాల వద్ద సందడి
జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పన్నుల బకాయిలు వసూలు అవుతున్నాయి. బుధవారం మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు తమ పేరిట ఏమైనా పన్నుల బకాయిలు ఉన్నాయా అనే సమాచారం తెలుసుకునేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను సంప్రదిస్తున్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద వివరాలు తెలుసుకుంటున్నారు. నామినేషన్లు వేసే వారితో పాటు వారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారు సైతం ఎలాంటి పన్నుల బకాయిలు ఉండరాదనే నిబంధన ఉండడంతో అభ్యర్థులు తమ ప్రతిపాదకులను వెంటబెట్టుకుని వచ్చి అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆస్తి, నల్లా, వ్యాపార కేంద్రాల పన్నుల బకాయిల వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో సేవా కేంద్రాల కౌంటర్లు సందడిగా మారాయి.
ఏర్పాట్ల పర్యవేక్షణ
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆర్డీఓ దేవుజా, డీఎస్పీ సైదా, మున్సిపల్ కమిషనర్ జైత్‌రాం, సీఐ శివలింగం, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, కాశీనాథ్‌లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు వేసే కేంద్రాల్లోకి పరిమితంగానే అనుమతించారు. ఎన్నికల సంఘం నియమావళిని అమలు చేస్తున్నారు. మొదటి రోజున నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, అభ్యర్థులు సాదా సీదాగా వచ్చి నామినేషన్లు వేశారు.


