భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
వివరాలు వెల్లడించిన పోలీసులు
సిద్దిపేటకమాన్: అనుమానంతో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసి, అడ్డొచ్చిన కూతురిపై హత్యా యత్నానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్న దున్నపోతుల ఎల్లయ్య (40) ఇంట్లో నిద్రపోతున్న తన భార్య శ్రీలతను అనుమానంతో ఈ నెల 18న తెల్లవారుజామున కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న తన కూతురు హర్షితను తలపై రోకలితో బాది, కత్తితో మెడ కోసి చంపడానికి ప్రయత్నించాడు. తర్వాత నిందితుడైన ఎల్లయ్య సైతం గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడు దున్నపోతుల ఎల్లయ్యను రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం హర్షిత హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ప్రాణాపాయ స్థితిలో ఉందన్నారు. ఏఎస్‌ఐ ముత్యం, కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు.


