పకడ్బందీగా కోడ్ అమలు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలతోపాటు నామినేషన్ కేంద్రాలను పోలీసు అధికారులు సందర్శించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌హెచ్‌ఓలకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయా కేంద్రాలను సందర్శించి సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించాలన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద
పాటించవలసిన సూచనలివీ..
● నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్‌ఎస్ ఎస్ (144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుంపులుగా ఉండకూడదు.
● కేంద్రానికి అభ్యర్థితోపాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతిస్తారు.
● శాంతి భద్రతలు పాటించాలి. నినాదాలు, ప్రచారం పూర్తిగా నిషేధం.
● పరిసరాల్లో నినాదాలు, లౌడ్ స్పీకర్లు, బ్యాండ్లు వాడకూడదు. అదేవిధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయకూడదు.
● ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలి.
● నామినేషన్ కేంద్రం పరిసరాల్లో మద్యం తాగడం, పంపిణీ చేయడం నిషేధం.
● ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదు.
● సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదు.
● నామినేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు.
ఎస్పీ పరితోశ్ పంకజ్


