విద్యుదాఘాతంతో రైతు మృతి
వెల్దుర్తి(తూప్రాన్): విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని శెట్టిపల్లికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పడిగె అంజయ్య(46) గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద బోర్ మోటార్ పనిచేయకపోవడంతో స్టార్టర్ వద్ద చెక్ చేస్తుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
మద్దూరు(ముస్నాబాద్): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బెక్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు,గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చొప్పరి కనకయ్య(50) ఈనెల 21న తన పెద్దకూతురు ఇంటి వద్ద పండుగ ఉండటంతో సముద్రాల గ్రామానికి బైక్‌పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో తోర్నాల గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌటకూరు మండలం వెండికోల్ గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద మంగళవారం మృతదేహం లభ్యమైంది. పుల్కల్ ఎస్‌ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడికి 30 సంవత్సరాలు ఉంటాయని, నీలం రంగు ఫుల్ కట్ అండర్‌వేర్, క్రీమ్ రంగు నిలువు గీతలతో ఉన్న కాలర్ లేని టీ–షర్ట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు పుల్కల్ పోలీస్ స్టేషన్ నం. 87126 61837, జోగిపేట సీఐపీ – 87126 56723 ను సంప్రదించాలని కోరారు.


