మోగిన నగారా
11 మున్సిపాలిటీలు.. 256 కౌన్సిలర్ స్థానాలకు...
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో 256 కౌన్సిలర్ స్థానాలకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే నామినేషన్ల స్వీకకరణ కొనసాగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌన్సిలర్ స్థానాలకు మున్సిపల్ కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతి రెండు, మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆయా వార్డు కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఈ రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. రిటర్నింగ్ అధికారులుగా హెచ్‌ఎం స్థాయి అధికారులను నియమించారు. నామినేషన్ల స్వీకరణ గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు పలు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి..
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలులోకి రానుంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం వీలు పడదు. అలాగే ఎన్నికలు ముగిసే వరకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు వీలుండదు. ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
నేటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి నియామకం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
ఎన్నికల నోటిఫికేషన్,
నామినేషన్ల స్వీకరణ: 28.01.2026 (ఉ.10.30 నుంచి సా.5.00 వరకు)
నామినేషన్ల దాఖలు చివరి తేది:
30.01.2026 (సా.5 గం.ల వరకు)
నామినేషన్ల పరిశీలన: 31.01.2026
నామినేషన్ల తిరస్కరణపై అప్పీలుకు చివరి తేది: 01.02.2026
నామినేషన్ల ఉపసంహరణకు గడువు : 03.02.2026 (మ.3 గం.ల వరకు)
బరిలో నిలిచే తుది అభ్యర్థుల ప్రకటన: 03.02.2026 (మ.3 గం.ల తర్వాత)
పోలింగ్ తేది : 11.02.2026
(ఉ.7 గం.ల నుంచి సా.5 గం.ల వరకు)
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన:
13.02.2026 (ఉ.8 గం.ల నుంచి)
మోగిన నగారా


