ఆయకట్టు హుష్ కాకి
మట్టితీత లేక
పూడుకుపోయిన కాల్వలు
కంగ్టి(నారాయణఖేడ్): ఖేడ్ నియోజకవర్గంలో నల్లవాగు ప్రాజెక్టు తర్వాత అత్యంత ఎక్కువ ఆయకట్టున్న ప్రాజెక్టు కంగ్టి మండలం దామర్‌గిద్దా కాకివాగు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు కుడి కాలువ 15 తూములతో దాదాపు 900 ఎకరాల ఆయకట్టు, ఎడమకాలువ 10 తూములతో దాదాపు 230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, తూములు ధ్వంసం కావడం, కాల్వలు పూడుకుపోవడంతో 150 ఎకరాలకు కూడా సాగునీరందడం లేదని రైతులు తెలిపారు.
సాగు నీటి అక్రమ తరలింపు
చెరువు నీటిని లిఫ్ట్ పంపులసాయంతో ఎగువన ఉన్న రాసోల్, గాజుల్‌పాడ్, సుక్కల్‌తీర్థ్ గ్రామాలకు చెందిన రైతులు అక్రమంగా తరలిస్తున్నారు. వేసవి పంట సీజన్‌లో చెరువులో దాదాపు 80కి పైగా మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువ ఆయకట్టు రైతుల చేలకు సాగు నీరు అందడం లేదు. ఏటా పంటలు చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోతున్నాయి.
తైబంది చేసి.. నిబంధనలు గాలికి
చెరువు కింది ఆయకట్టు రైతులు వేసవిలో ఏయే పంటలు నిర్దేశిత ఎకరాల్లో వేసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులు తైబంది చేస్తున్నారు. అయితే చెరువులోని లిఫ్ట్ పంపుల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువు ఎగువనున్న గ్రామాల వారు చెరు వు నీటి ఆధారంగా పంటలు వేయకుండా ఇప్పుడే ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించడం, మోటార్లతో నీటిని తరలించే వారిపై చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం వంటివి చేస్తేనే ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రజావాణిలో ఫిర్యాదు
ఎగువన మోటార్లతో నీటిని తోడకుండా చర్యలు తీసుకోవాలని, కాల్వలు, తూముల మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ, దామర్‌గిద్దా గ్రామాల ఆయకట్టు రైతులు ప్రజావాణిలో నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు అధికారులు చర్యలకు ఉపక్రమించలేదు. సంబంధిత శాఖలోని డివిజన్, మండలస్థాయి అధికారులకు ఈ విషయం తెలియదని సమాచారం.
150 ఎకరాలకు కూడాసాగునీరు అందని వైనం
కాల్వల మరమ్మతులకు ఏటా ప్రతిపాదనలతోనే సరి
కాకివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తప్పని దుస్థితి
ఆయకట్టు హుష్ కాకి


