మున్సిపోల్‌కు పార్టీలు సిద్ధం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. టికెట్ల ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ఆయా పార్టీలు తమ తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 26 వార్డులకుగాను, ఇప్పటికే 11 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా మంగళవారం మరో ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగియనుంది. దీంతో మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ స్థానాలకు ఈ పార్టీలు బుధ, గురువారాల్లో విడతల వారీగా ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు సంబంధించి చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది.
నామినేషన్లకు రెడీ
నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇటు అభ్యర్థులు సైతం సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ వేయాలంటే సంబంధిత మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సర్టిఫికెట్ల కోసం ఆశావహులు ఆయా మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఆయా మున్సిపాలిటీల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విడతల వారీగా అభ్యర్థిత్వాల ప్రకటన
నేడో, రేపో పూర్తిస్థాయిలో టికెట్ల ఖరారు
నామినేషన్లకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు


