అభివృద్ధి పనులను అడ్డుకోవద్దు
హైడ్రా కమిషనర్ రంగనాథ్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని జరుగుతున్న రాయసముద్రం చెరువు అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని భెల్ అధికారులకు హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. రాయసముద్రం చెరువును రంగనాథ్ మంగళవారం సందర్శించారు. చెరువు అభివృద్ధి పనులను భెల్ యాజమాన్యం అడ్డుకుంటుందని గత కొద్దిరోజుల క్రితం స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చెరువు పనులను పరిశీలించేందుకు భెల్ అధికారులతో ఆయన కలసి వచ్చారు. అక్కడ చెరువు పరిసరాలను, మురుగునీటిని మళ్లించే ప్రాంతాన్ని పరిశీలించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బి.పుష్ప, వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


