అక్రమంగా మట్టి తరలింపు
వాహనాలు సీజ్
మనోహరాబాద్(తూప్రాన్): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో టీఎస్‌ఐఐసీ అధికారులు, టిప్పర్‌లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, టీఎస్‌ఐఐసీ మేనేజర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొండాపూర్ పరిశ్రమల వాడ స్థలం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్‌లు, ఒక హిటాచీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. కాగా జోనల్ మేనేజర్ అనురాధ, కమిషనర్ దినేశ్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిశ్రమల వాడలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ చర్యలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


