బోరు వేయించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఆదివారం బోరు వేయించారు. గ్రామానికి చెందిన బేగరి రాములును పరామర్శించేందుకు ఇటీవల ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లారు. బోర్ల నుంచి నీరు పట్టుకోవద్దని కొంత మంది అభ్యంతరం చెబుతున్నారని గ్రామానికి వెళ్లినప్పుడు దళితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడారు. దళితుల నీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల నాయకులు గ్రామంలో బోరు వేయించారు.
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చిన దుప్పిని తండా వాసులు రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దారి తప్పిన దుప్పి పిల్ల ఆదివారం కిషన్ తండా పరిధిలోని లాక్య తండాలోకి రాగా కుక్కలు వెంబడించాయి. దీంతో గిరిజనులు దానిని రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు దుప్పిని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించి పోచారం అభయారణ్యంలో వదిలేశారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు
దుబ్బాకరూరల్: ఇంట్లో మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అక్బర్‌పేట – భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు... దుద్దెడ భిక్షపతి తన భార్య, కుమారుడితో కలిసి డబుల్ బెడ్రూమ్‌లో ఉంటున్నాడు. భిక్షపతి మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న అతని భార్య, కుమారుడు మంటలు ఆర్పారు. కాగా భిక్షపతికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. చుట్టు ప్రక్కల వారు గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన భిక్షపతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య, కుమారుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.
జిన్నారం (పటాన్‌చెరు): అతివేగంగా నడుపుతూ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం లక్ష్మీపతిగూడెం బ్రిడ్జి నుంచి గురుకుల పాఠశాల వైపు అతివేగంగా, అజాగ్రత్తగా ఇన్నోవా వాహనం నడుపుతూ మూల మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బోరు వేయించిన ఎమ్మెల్యే
బోరు వేయించిన ఎమ్మెల్యే


