యాసంగికి మల్లన్న సాగర్ నీళ్లందించాలి
పెద్దగుండవెల్లి రైతుల డిమాండ్
దుబ్బాకరూరల్: యాసంగి సాగుకు మల్లన్న సాగర్ నీళ్లందించాలని పెద్దగుండవెల్లి రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పెద్దగుండవెల్లి రైతు వేదికలో రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మల్లన్న సాగర్ కాలువ పనులను పూర్తి స్థాయిలో చేయలేదని, దీంతో గత సంవత్సరం యాసంగిలో పంటలు ఎండిపోయాయని వాపోయారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంట పొలాలను నీళ్లందించాలనే ఉద్దేశంతో కాలువలు తవ్వారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాసంగికి నీళ్లు అందించకపోవడం వల్ల రెండు వేల ఎకరాల భూమి బీడు భూములుగా ఉంటున్నాయన్నారు. ఈ విషయాన్ని మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. కాలువ పనులు పూర్తి చేసి ప్రస్తుతం సాగు చేస్తున్న యాసంగి పంటలకై నా సాగు నీరందించాలని కోరారు. లేదంటే పలు గ్రామాల రైతులతో చర్చించి పెద్ద ఎత్తున సాగు నీటి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


