హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేటకమాన్: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణంలోని సాజిద్‌పూరలో నివాసం ఉంటున్న అబ్దుల్ ఖదీర్ స్థానికంగా కొంత కాలంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత నెల 23న అదే ప్రాంతానికి చెందిన ఫిరోజ్ మద్యం మత్తులో ఖదీర్ ఇంటి ముందు పడిపోయాడు. గమనించిన ఖదీర్ మానవత్వంతో పడిపోయిన అతడిని లేపి ఇంటికి వెళ్లమని సూచించాడు. దీంతో ఆగ్రహించిన ఫిరోజ్ చికెన్ సెంటర్‌లోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ, కోడిగుడ్ల ట్రేలను ధ్వంసం చేశాడు. దుకాణంలోని కత్తితో బాధితుడిని చంపుతానని వెంటపడటంతో అతడు పారిపోయాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో సిద్దిపేట వన్‌టౌన్, టూటౌన్, తొగుట పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. పట్టణంలో నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.


