లేగదూడను చంపితిన్న చిరుత
చేగుంట(తూప్రాన్): లేగదూడను చిరుత చంపితినింది. ఈ సంఘటన మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పులిగుట్ట తండాకు చెందిన లక్ష్మి, కిషన్ దంపతులు పశువులను పెంచుకుంటూ జవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పశువులను మేతకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం కుంట సమీపంలో నీటిని తాగించేందుకు తోలుకెళ్తుండగా అడవి ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పశువుల గుంపులోని లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది. భయంతో కిషన్, లక్ష్మి తండాలోకి పరిగెత్తి తండావాసులకు విషయం చెప్పారు. తండావాసులు కుంట వద్దకు వెళ్లి చూడగ లేగదూడను చంపి సగం తినేసినట్లు గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, తండా వాసులంతా జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించారు.


