హరిద్ర నది ఒడ్డున నాచగిరి
వర్గల్(గజ్వేల్): హరిద్రనది పరవళ్లు, ప్రకృతి రమణీయతలతో అలరారే సుప్రసిద్ధ నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం ఆంగ్ల సంవత్సరాది రోజు భక్తులతో పోటెత్తనున్నది. ఆ రోజున స్వామివారిని పదివేలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. ఇందుకు అనుగుణంగా ఆలయ పాలకవర్గం తగు కార్యాచరణ సిద్ధం చేసింది. ఏర్పాట్ల వివరాలను ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు వెల్లడించారు. ఆంగ్ల సంవత్సరాది రోజున భక్తుల తాకిడితో జనం కిక్కిరిసిపోకుండా తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునే ప్రతిభక్తునికి తీర్థంతోపాటు బెల్లం పొంగలి ప్రసాదం ఉంటుంది. అమ్మకం ప్రసాదాల కోసం రెండున్నర క్వింటాళ్ల పులిహోర, 8వేల లడ్డూలు, 2వేల వడ, 1500 అభిషేకం లడ్డూలు స్టాక్ ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. స్వామివారి అభిషేకం సమయం మినహాయించి, తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా భక్తులకు దర్శనం ఉంటుంది. పోలీసు బందోబస్తుతోపాటు, వివిధ సేవాసమితి బృందాల సేవలు వినియోగించుకుంటామని ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ వివరించారు.


