తెలంగాణ తిరుమల.. బాలాజీ ఆలయం
దుబ్బాక: కలియుగ దైవం..కోరిన భక్తుల కొంగు బంగారం.. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయానికి నూతన సంవత్సరం సందర్భంగా(గురువారం) భక్తులు భారీగా తరలిరానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సరం రోజు సుమారుగా 50 వేలకు పైగా భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన భూంపల్లి–అక్బర్‌పేట మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం, చౌదర్‌పల్లిలో స్వయంభువుగా వెలసిన దుబ్బరాజేశ్వర ఆలయం, చెల్లాపూర్ సోమేశ్వర ఆలయాలకు సైతం వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో ఆ ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.


