
ఆటలాడేటోళ్లం.. అల్లరి చేసేటోళ్లం
సాక్షి, సిద్దిపేట: ‘బాల్యపు జ్ఞాపకాలు నేటికీ మధురస్మృతులు.. వేసవి సెలవులు వచ్చాయంటే మాకు పండుగే.. ఆటలు ఆడేటోళ్లం.. అల్లరి చేసేటోళ్లం.. వేసవి సెలవులొస్తే దాదాపు రెండు నెలలు స్నేహితులతో సరదాగా గడిపే వాళ్లం’ అని రచయిత, ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. సిధారెడ్డి తన బాల్యంలోని వేసవి జ్ఞాపకాలను ’సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. సిద్దిపేట మండలం బంధారం గ్రామం మాది. మా ఊరులో పాఠశాల లేకపోతే వెల్కటూరుకు వెళ్లే వాళ్లం. వెల్కటూరు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సమయంలో దాహం వేస్తే మేము బావుల దగ్గరికి, ఎవరి ఇంటికై నా వెళ్లి నీళ్లు తాగి వచ్చే వాళ్లం. ఒక రోజు నాకు బాగా దాహం వేయడంతో బావి దగ్గరికి వెళ్లాను. దరి తెలియకపోవడంతో జారి బావిలో పడిపోయాను. అప్పుడు నాకు ఈత రాదు, నేను చనిపోయాను అనుకున్నా.. నన్ను వెతుక్కుంటూ నా బాల్య మిత్రుడు పోచయ్య వచ్చాడు. వెంటనే నన్ను చూసి బావిలోకి దూకి కాపాడారు. అప్పుడు పోచయ్య నన్ను కాపాడకపోతే నేను బతికేవాడిని కాదు. అలా నాకు పోచయ్య ప్రాణదాత అయ్యాడు. ఇది నా జీవితంలో మరచిపోని సంఘటన.
దొంగచాటుగా
మామిడి కాయలు తెంపుకునేటోళ్లం
మేము దాదాపు 10 మంది కలిసి వెళ్లే వాళ్లం. ఓ ఇద్దరు అక్కడ కాపాలా ఉండే వారితో ముచ్చట పెడుతుంటే మరికొందరు తోటలోకి వెళ్లి మామిడి కాయలు, అల్లనేరేడు పండ్లు తెంపుకొచ్చేవాళ్లు. అప్పుడు ఫోన్‌లు సైతం సరిగా లేవు. మా ఊరు బంధారానికి కరెంటే లేదు. ఇప్పుడు చిన్న పిల్లలందరూ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్‌లు ఇవ్వకుండా పర్యాటక ప్రాంతాలు చూపించాలి. ిఫిజికల్ యాక్టివిటీస్ చేపించాలి. మంచి పుస్తకాలు చదువుకునే విధంగా ప్రోత్సహించాలి.
మాట్లాడుతున్న సిధారెడ్డి
వేసవి సెలవులు వచ్చాయంటేరెండు నెలలు పండుగే నాడు బావిలో పడిపోతే బాల్యమిత్రుడు పోచయ్య కాపాడిండు ‘సాక్షి’తో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి
స్నేహితులే ఈత నేర్పారు..
పరీక్షలు అయిపోయి.. రిజల్ట్ తీసుకోగానే వేసవి సెలవులు దాదాపు రెండు నెలలు ఎంజాయ్ చేసేవాళ్లం. 6వ తరగతిలో జరిగిన సంఘటనతో నాకు స్నేహితులు ఈత నేర్పించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈత కొట్టేవాళ్లం. ప్రతి రోజు ఉదయం పూట నేను వడ్ల సత్తయ్య, మధుసూదన్, పోచయ్య, బాల్‌నర్సయ్య, అంజిరెడ్డి, ఆగంరెడ్డి ఇలా దాదాపు 10 మంది కలిసి ఈతకు వెళ్లాం. తిండి తిప్పలు మానేసి ఈత కొట్టాం. బావిలో ముట్టించుకునే ఆటలు ఆడేటోళ్లం. ఇంటికిపోయే సమయంలో ఎండకు కాళ్లు కాలుతుంటే మోదుగు ఆకులు, సీతాఫలం కొమ్మలతో కలిపి చెప్పులాగా కుట్టుకొని రక్షణ పొందాం. సాయంత్రం చిర్రగోనే, తాటి ముంజలతో బండి, చింతగింజల ఆట, గోటీలు ఆడేటోళ్లం.