వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది భార్య. ఈ ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్‌లో చోటు చేసుకుంది. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి శ్రీను(25) ఏప్రిల్ 16న ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని భార్య లత 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి భార్య లత అదే గ్రామానికి చెందిన మల్లేశంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ పెట్టారు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని భావించిన లత అదే గ్రామానికి చెందిన తన మిత్రుడు మోహన్‌కు రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్యకు ఒప్పందం కుదుర్చుకుంది. పథకం ప్రకారం గత నెల 16న మధ్యాహ్నం శ్రీనును బ్యాతోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మద్యం, కల్లు సేవించి సీసాతో నెత్తిపై కొట్టగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ హత్యకు వివాహేతర కారణమని, దీనికి కారణమైన మృతురాలు భార్య మైలి లత, మోహన్, మల్లేశంను విచారించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
హవేళిఘణాపూర్‌లో ఘటన


