
కేతకీలో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.