
తోటల్లోనే టమాటా
గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్న రైతులు
● కిలో ధర రూ.5 నుంచి రూ.7 వరకు ● మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు ● ధర పతనమవడంతో పశువులకు మేత
మర్కూక్(గజ్వేల్): ఆరుగాలం కష్టించి పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పశువులను మేపుతున్నారు. కొన్ని రోజుల క్రితం రూ.15 పలికిన టమాటా ధర ఇప్పుడు రూ.5 నుంచి రూ.7వరకు పలుకుతోంది. కోటి ఆశలతో పంట సాగుచేస్తే పెట్టుబడి, రవాణా ఖర్చులు రాకపోగా చివరికి రైతులకు చెమట చుక్కలే మిగిలాయి. సాగు చేసే ముందు ధరలు బాగానే ఉన్నా తీరా పంట చేతికొచ్చేసరికి పూర్తిగా ధర పతనమై నష్టాల పాలయ్యామని రైతులు వాపోతున్నారు.
మర్కూక్ మండలంలో పెద్ద ఎత్తున సాగు..
మండలంలోని పలు గ్రామాల్లో రైతులు చాలా వరకు టమాటాను సాగు చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే కనీసం కూలీల డబ్బులు రావడం లేదని ఏమీ చేయలేక పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటిమామిడి, గజ్వేల్, జగదేవ్‌పూర్ ఈసీఐఎల్ లాంటి పెద్ద మార్కెట్లకు.. టమాటాను తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా కొనేవారు కరువయ్యారు. చివరికి ఎంతో కొంత తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలోని ఎర్రవల్లి, మర్కూక్, పాములపర్తి, దామరకుంట, వర్ధరాజ్‌పూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ప్రతి వారం ఏర్పాటు చేసే సంతకు రైతులు టమాటను తీసుకెళ్తున్నారు. కానీ ఎవరు కొనడం లేదని, కొన్నా చివరికి రూ.5 నుంచి రూ.7లకు కిలో ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. మిగిలిన పంటను పశువులకు మేతగా వేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే రవాణా చార్జీలు కూడా రావడం లేదని చెబుతున్నారు. గత సంవత్సరం కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 పలికింది. ఈ సారి టమాటాను సాగుచేస్తే లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ ధర పతనమవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తోటల్లోనే టమాటా