మిరుదొడ్డి(దుబ్బాక): అనారోగ్య సమస్యలు భరించలేక చెరువులో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, మిరుదొడ్డి పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మద్దెల నర్సవ్వ (80) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఒక్కగానొక్క కొడుకు వద్ద కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవడంతో తాళలేక పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో నర్సవ్వ కుటుంబ సభ్యులు బంధు మిత్రుల వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారు జామున మిరుదొడ్డిలోని పెద్ద చెరువులో నర్సవ్వ శవమై కనిపించింది. మృతురాలి కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బోయిని పర్శరాములు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడు..
మెదక్ మున్సిపాలిటీ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని బారాహీమాం వీధిలో నివాసం ఉండే అమిన్‌పూర్(మోచి) యాదగిరి కుమారుడు అరవింద్(24) ఆర్టీసీ డిపోలో రెగ్జిన్ వర్క్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అరవింద్ తన తల్లి శాంతమ్మకు అనారోగ్యం కారణంగా రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కోసం నిత్యం బాధపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ అరవింద్ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం వెతకగా ఇంటి పక్కన ఉన్న ఓ చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. అప్పుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య