మత్స్యకార కుటుంబాలకు చేయూత
నారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందిస్తోందని మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్‌కు వచ్చిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 6,153 మత్స్య సహకార సంఘాలు ఉండగా 40 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హాయాంలో 2018 నుంచి 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా 571 మంది మత్స్యకారులు మృతిచెందగా ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. పథకాల పేరిట స్కామ్‌లతో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి రూ.24 కోట్లను అప్పటి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దోచుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా సమాఖ్యకు చైర్మన్‌ను నియమించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి సమాఖ్య రూ.48.70 లక్షల లోటుతో ఉండేలా చేశారన్నారు. వారు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ హయాంలో ఖేడ్ ప్రాంతంలోని మత్స్యకారులు అన్యాయానికి గురయ్యారన్నారు. అర్హులు సభ్యులుగా చేరడంతోపాటు మరిన్ని సంఘాలు, మహిళా మత్స్యకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు మాజీద్, హన్మాండ్లు, సద్దాం, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, రాజేందర్ పాటిల్ పాల్గొన్నారు.
సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్


