అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని చిన్న చిన్న పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా చెక్‌ లిస్ట్‌ ప్రకారం యాజమాన్యం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో అగ్ని ప్రమాదాల నివారణ, వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్‌ రమేశ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనిని నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకుసాగాలని సూచించారు. జిల్లాలోని తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట వంటి మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, మిగతా ప్రాంతాలలో కూడా ఉన్న చిన్నచిన్న పరిశ్రమలలో అగ్నిప్రమాదాలు జరగకుండా చెక్‌ లిస్ట్‌ ప్రకారం యాజమాన్యం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నరా లేదా పరిశీలించాలన్నారు. జాగ్రత్తలు లేకుంటే నోటీసులు ఇచ్చి వారంలోగా ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు పాటించేలా ఆదేశాలివ్వాలని అగ్నిమాపక అధికారికి సూచించారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పరిశీలించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు జిల్లా కలెక్టర్‌ ఖాతాకు ఇచ్చేలా ఏడీమైన్స్‌, జిల్లా పరిశ్రమల అధికారి నేతృత్వంలో అగ్నిమాపక, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, పరిశ్రమల శాఖ అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండు బృందాలు పరిశ్రమల యాజమాన్యాలకు ముందస్తుగా సమాచారమిస్తూ అన్ని పరిశ్రమలను తనిఖీలు చేసి వారంలో నివేదిక అందించాలన్నారు.

ఉపాధి హామీ పనివేళల్లో మార్పులు చేయాలి

ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పని వేళల్లో మార్పులు చేయాలని, పనులు జరిగే ప్రదేశంలో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీలలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓకు సూచించారు. సమావేశంలో అగ్నిమాపక అధికారి గౌతమ్‌, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, డీఆర్డీఓ శ్రీనివాస్‌, డీఈఓ రాధాకిషన్‌, ఇన్స్‌పక్టర్‌ సాఫ్‌ ఫ్యాక్టరీస్‌ లక్ష్మీ కుమారి, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, మున్సిపల్‌ కమిషనర్‌, తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top