టూరు.. ఒక్కో తీరు | young people Interest on solo travellind | Sakshi
Sakshi News home page

టూరు.. ఒక్కో తీరు

Jun 8 2025 4:46 AM | Updated on Jun 8 2025 4:46 AM

young people Interest on solo travellind

సోలోగా తిరిగేస్తున్న యువత

సినిమాలు, సిరీస్‌లు చూసి ప్లానింగ్‌ యుద్ధభూములనూ చుట్టేస్తున్నారు

క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్న ఊరికి వెళ్తున్నారు

మారుతున్న పర్యాటక ఆసక్తులు

పర్యాటకుల ఆసక్తులు మారాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సో బెటరూ అంటున్నారు. కొందరు సోషల్‌ మీడియా వీడియోలూ, వెబ్‌ సిరీస్‌లూ, సినిమాలూ చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరు సపరివార సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంకొందరు క్రికెట్‌ మ్యాచ్‌లను బట్టి తమ టూర్లు ప్లాన్‌ చేసుకుంటున్నారు.. యుద్ధభూముల్లో స్ఫూర్తి పొందుతున్నారు.. నిశీధిలో నింగిలోని చుక్కలను లెక్కపెట్టేస్తున్నారు.. ఇది నయా పర్యాటక ముఖచిత్రం.

‘‘పాతాళ్‌లోక్‌ సీజన్‌ 2’.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వచ్చిన వెబ్‌ సిరీస్‌. ఈశాన్య భారతంలోని నాగాలాండ్‌లో ఎక్కువ భాగం షూట్‌ చేశారు. ఒక సినిమా లేదా వెబ్‌ సిరీస్‌ ఇంత స్థాయిలో అక్కడ షూట్‌ జరగడం ఇదే మొదటిసారి. అక్కడి పచ్చని కొండ ప్రాంతాలు, ఇళ్లు, దట్టమైన వెదురు అడవులు.. అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. అది చూశాక నాకు నాగాలాండ్‌ వెళ్లాలనిపించింది.

స్నేహితులతో వెళ్లి వచ్చేశా’’ అంటాడు హైదరాబాద్‌కి చెందిన కె.ఉమావెంకట్‌. ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు వారాంతాల్లో కూడా స్నేహితులతో వరంగల్‌ వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సరదాగా వెళ్లి వచ్చేస్తుంటాడు. ‘ఉద్యోగంలో చేరిన తరవాత కొత్త స్నేహితులు వచ్చారు. వీళ్లే నాకు సహచరులు, స్నేహితులు’ అంటాడు. ఇలాంటి వాళ్లనే ఇప్పుడు ఫ్రొలీగ్స్‌ అని పిలుస్తున్నారు. అంటే ఫ్రెండ్స్‌ అయిన కొలీగ్స్‌ అన్నమాట. ఇలా సహచర ఉద్యోగ స్నేహితులతో షికార్లకు వెళ్లడం ఇటీవలికాలంలో పెరిగింది.

దేశభక్తి.. ప్రకృతి సౌందర్యం..
యుద్ధభూమి అంటే వీరత్వానికి ప్రతీక. సైనికుల ధైర్యసాహసాలకు వేదిక. అలాంటి రణభూమికి కూడా పర్యటనలకు వెళ్లేందుకు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రణభూమి దర్శన్‌’ పేరిట  ప ర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్, లఢాక్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అరు ణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో 77 ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత సాయుధ దళాల త్యా గాలను ఇవి గుర్తుచేసి, సందర్శకులను రోమాంఛితం చేస్తాయి. ఇవి దేశభక్తి, ప్రకృతి సౌందర్యాల కలబోతలు.

తారాలోకం చూస్తూ..
రాత్రిపూట ఖగోళ రహస్యాలను, చందమామ, నక్షత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తోందని వారు చెబుతున్నారు. ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ‘ స్కైస్కానర్‌’ నిర్వహించిన సర్వేలో.. రాత్రిపూట ఆకాశాన్ని ఫొటోలు తీసేందుకు ఇష్టపడి పర్యటనలకు వెళ్లినవారు 56% మంది. రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు ఉండగా కొండప్రాంతాల్లో నిద్రించేందుకు వెళ్లినవారు 53% మంది.

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి..
సోషల్‌ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు సామాన్యులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనేక ప్రదేశాల గురించి చెబుతున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, సోనీ లివ్‌ వంటి వేదికల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు కూడా పర్యటనలు చేయాలను కునేవారిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థలు థామస్‌ కుక్, ఎస్‌ఓటీసీ వి డుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్‌ 2025’ సర్వేలో.. ఇలాంటి ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నామని 60 శాతం మంది చెప్పడం విశేషం. ఇలా వెళ్లేవారిలో యువతే∙అధికం.

సపరివార సమేతంగా..
యువతరం తమ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ / నాన్నమ్మలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం, 5–6 అంకెల జీతం.. వీరిని ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు గతంలో ఎక్కువ పర్యటనలు చేయకపోవడం కూడా యువతను ఈ నిర్ణ యానికి ప్రేరేపిస్తోంది. దీంతో సపరివార సమే తంగా విహారయాత్రలు చేస్తున్నారు. ‘ఇండి యా హాలిడే రిపోర్ట్‌ 2025’ ప్రకారం దాదాపు 65% ఇలా పర్యటనలకు వెళ్తున్నారు.

క్రికెట్‌ ప్రేమికులూ..
క్రికెట్‌ను ఇష్టపడేవారు క్రికెట్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ప్రకా రం టూర్లు ప్లాన్‌ చేసుకుంటున్నారు. టీ20, వన్డే వంటి మ్యాచ్‌లు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రకరకాల స్థానిక రుచులను ఆస్వాదిస్తు న్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మ్యాచ్‌లను ఇలా చాలామంది చూశారట. ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ స్కై స్కానర్‌ ‘పిచ్‌ పర్‌ఫెక్ట్‌ జర్నీస్‌’ ప్రకారం.. 48% మంది మ్యాచ్‌కి కనీసం 2 నెలల ముందే ఇలా ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. వీరిలో స్నేహితులతో వెళ్లినవారు 74% కాగా, కుటుంబంతో వెళ్లినవారు 59%. భార్య లేదా ప్రియురాలు / సహజీ వనం చేస్తున్నవారితో వెళ్లినవారు 46 శాతం.

మిమూనింగ్‌.. సోలో పర్యటన
హనీమూన్‌ వినే ఉంటారు. అంటే జీవిత భాగస్వామితో వివాహానంతరం చేసే విహార యాత్ర. మి మూనింగ్‌ అంటే.. ఒక్కరే వెళ్లడం. ప్రభాస్‌ నటించిన ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు ‘తనలో తామే రమించడం’. ఒక్కరే ఆ అనుభూతిని ఆస్వాదించడం. ట్రెకింగ్, వాటర్‌ రాఫ్టింగ్‌ వంటి సాహస యాత్రలు చేయడం. ఎలాంటి బాదరబందీ లేకుండా ఒక్కరే.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవడం, ఎంజాయ్‌ చేయడం. ఇలా వెళ్లి స్థానికతను ఆస్వాదిస్తున్నారు.

ఆయా ప్రాంతాల్లో స్థానిక పండుగలూ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక రుచులను టేస్ట్‌ చేస్తున్నారు. భారత్‌ సహా 7 దేశాల్లో నిర్వహించిన ‘అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2024 గ్లోబల్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌’ రిపోర్ట్‌ ప్రకారం.. 84 శాతం మంది మిమూనింగ్‌ ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రపంచ సగటు 66 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.  భారత్‌ సహా 13 దేశాల్లోని 13 వేల మందిని 2024 జూన్‌లో సర్వే చేసిన రిపోర్టు ‘హిల్టన్‌ 2025 ట్రెండ్స్‌’. దీని ప్రకారం సోలో పర్యటనలు చేస్తున్నవారు 47 శాతం మంది. వీరిలో మిలీనియల్స్‌ (1981–96 మధ్య పుట్టినవారు) 51 శాతం కాగా, జనరేషన్‌ జెడ్‌ (1997–2012 మధ్య పుట్టినవారు) 55 శాతం కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement