స్వచ్ఛ కుంభమేళా | kumbh mela 2025: environmental challenges and sustainable solutions for maha kumbh | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ కుంభమేళా

Jan 22 2025 5:19 AM | Updated on Jan 22 2025 5:19 AM

kumbh mela 2025: environmental challenges and sustainable solutions for maha kumbh

సాధారణ రోజుల్లో ప్రయాగరాజ్‌కు రెండు మూడు లక్షల మంది సందర్శకులు.. కుంభమేళా సమయంలో కోటి మంది చొప్పున హాజరు 

మేళా సమయంలో పర్యావరణానికి పెద్దపీట వేస్తూ కేంద్రం, యూపీ ప్రత్యేక చర్యలు.. పవిత్ర సంగమంలో ప్రత్యేక మోటార్‌ వాహనాలతో నిరంతరం నీటి శుద్ధి 

స్వచ్ఛమైన గాలి కోసం ప్రయాగరాజ్‌ చుట్టుపక్కల ఏడాదిగా పది ప్రత్యేక వనాల పెంపకం 

ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై నియంత్రణ చర్యలు 

లక్షన్నర ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటు.. 

20 వేల మంది సఫాయి కార్మికుల సేవలు వినియోగం 

చెత్త తరలింపునకు 120కి పైగా టిప్పర్ల వినియోగం

(మహా కుంభమేళా ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) 
సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ పరిసరాలు వీలైనంత మేర పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 13న మొదలై 45 రోజులు నిరంతరం కొనసాగే.. భూమిపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి పరిశుభ్రత, పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

సాధారణంగా ఎక్కడైనా ఒక లక్ష మంది ప్రజలతో ఒక సభ జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎనిమిది రోజులపాటు రోజూ సరాసరి కోటి మందికి పైగా యాత్రికులు మహా కుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతాన్ని సందర్శిస్తున్నా.. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పరిశుభ్రత కోసం 20,000 మంది సఫాయి సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు.  

10 వేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లు..
ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పది వేల ఎకరాల విస్తీర్ణంలో మహా కుంభమేళా ఉత్సవాలు కొనసాగుతుండగా, యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు, 5,000 యూరినల్స్‌ కేంద్రాలు, 350 కమ్యూనిటీ టాయిలెట్లు, 10 టాయిలెట్‌ కాంపె­్లక్స్‌లు ఏర్పాటుచేసింది. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది సిబ్బందితో పాటు 12 కిలోమీటర్ల పొడవున్న 44 పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో 5,000 మంది పనిచేస్తున్నారు. త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసేందుకు 40 కాంపాక్టరు మోటార్లు వినియోగిస్తుండగా, ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తరలించేందుకు 120 టిప్పర్లను వినియోగిస్తున్నారు.

పారిశుధ్య కార్మికులకు బీమా
ఇక మహాకుంభమేళా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులతో పాటు బోట్‌మెన్‌లకు స్వచ్ఛ కుంభ్‌ ఫండ్‌ నిధుల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా పాలసీలు అందజేశారు. అలాగే, ప్లాస్టిక్‌ వస్తువు వినియోగంపై ముందే శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది సిబ్బంది కుంభమేళాకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్న యజమానులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభానికి నెలల ముందే ప్రయాగరాజ్‌ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే 400 పాఠశాలల్లో ఉపాధ్యాయులు, 4 లక్షల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.  

స్వచ్ఛమైన తాగునీటి కోసం 1,249 కి.మీ. పైపులైన్లు.. 
ఇక మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసేందుకు రోజూ భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే 1,249 కిలోమీటర్ల పొడవునా మంచినీటి పైపులైన్లును ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుద్ధిచేసిన తాగునీటిని ఆ పైపులైన్‌ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా 56,000 చోట్ల కుళాయిలు  ఏర్పాటుచేశారు. 85 గొట్టపు బావులు, 30 జనరేటర్లతో నడిచే పంపింగ్‌ స్టేషన్‌తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు, సిబ్బందిని నియమించారు. 

ఆకుపచ్చ మహాకుంభ్‌.. 
మహా కుంభమేళాలో భాగస్వాము­లయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశు­భ్రమైన, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభు త్వం రెండేళ్లుగా భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది. పది ప్రాంతాల్లో చిన్నచిన్న వనాలను రూపొందించింది. మహా కుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగరాజ్‌ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ, నిర్వహణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నగరానికి దారితీసే 18 ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం డ్రైవ్‌లు కొనసాగాయి. కదంబ, వేప, అమల్టాస్‌ వంటి స్థానిక జాతులకు చెందిన 50,000 మొక్కలు రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement