ప్రభుత్వ మద్దతు ధరకు మించి చెల్లిస్తున్న వ్యాపారులు మిల్లులకు క్యూ కడుతున్న రైతులు దొడ్డు రకానికి రూ.2,650..సన్నాలకు రూ.3,600 జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1.28 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా 2.80లక్షల మెట్రిక్ టన్నులు
బషీరాబాద్: జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. ధాన్యం మార్కెట్‌కు చేరుతోంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు కాకుండా ప్రైవేటు మిల్లులకే పంట తరలుతోంది. మిల్లర్లు ప్రకటిస్తున్న ధరలు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ఉండటంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. జిల్లాలోని 181 కేంద్రాలు రైతుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి.
మిల్లుల్లోనే మెరుగైన ధర
ప్రస్తుతం మార్కెట్‌లో దొడ్డు రకం వడ్లు క్వింటాకు రూ.2,650 వరకు చెల్లిస్తున్నారు. సన్న రకాలకు రూ.3,600 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మద్దతు ధర దొడ్డు రకాలకు రూ.2,460గా ఉండగా సన్నాలకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించింది. ఇలా అయినా ప్రైవేటులోనే అధిక ధరలు లభిస్తున్నాయి.ఽ దీంతో వరి రైతులు మిల్లుల బాట పడుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించాలంటే తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు, ఇతర నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు మిల్లుల్లో మాత్రం పచ్చి ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తుండటం రైతులకు కలిసివస్తోంది. ధర విషయంలోనూ మెరుగైన అవకాశం ఉండటంతో పాటు విక్రయ ప్రక్రియ త్వరగా పూర్తవుతుండటంతో మిల్లుల వద్దకు భారీగా ధాన్యం చేరుతోంది.
181 కేంద్రాలు.. కొనుగోళ్లు నిల్
జిల్లాలో ఈ సీజన్‌లో 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 181 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేంద్రంలోనూ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. భారీ దిగుబడి అంచనాలున్నా ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం. కేంద్రాల ఏర్పాటుకు చేసిన ఏర్పాట్లు నిరుపయోగంగా మారుతున్నాయి.
కొనేందుకు పోటీ
ఎల్‌నినో ప్రభావంతో రబీలో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో భవిష్యత్తులో బియ్యం సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు పోటీపడుతున్నారు. అయితే ప్రస్తుతం రైతులకు లభిస్తున్న ధరలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు కొనుగోళ్లలో తూకం, ధరల నిర్ణయం, చెల్లింపుల విషయంలో పారదర్శకత ఉండేలా అధికారుల పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు మిల్లులతో పోటీపడేలా ప్రభుత్వ కేంద్రాల్లోనూ ధరలు, సౌకర్యాలు కల్పిస్తేనే రైతులు అటువైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా ధాన్యమంతా ప్రైవేటు మిల్లులకే చేరే పరిస్థితి కొనసాగనుంది.
మిల్లులోనే మేలు
నేను ఏడెకరాల్లో సన్నరకం వరి పంట వేశా. సుమారు 200 బస్తాల ధాన్యం వచ్చింది. ప్రైవేటు మిల్లులో క్వింటాలుకు రూ.3,600 ధర లభిస్తోంది. ధాన్యం అంతా అక్కడే విక్రయిస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేవు.
– పరశురాం, రైతు మంతట్టి
ధాన్యం రావడం లేదు
జిల్లాలో సొసైటీల ద్వారా 82 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఉంది. వారం కిందట 37 కేంద్రాలు ప్రారంభించాం. అయినా ఒక్క రైతు కూడా ధాన్యం తీసుకురాలేదు. బయట ధర ఎక్కువగా ఉండటంతో రైతులు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా రాలేదు.
– జి.శ్రీనివాస్, డీసీఓ, వికారాబాద్


