ఇబ్రహీంపట్నం రూరల్: హెచ్‌సీజీ 4వ ఎడిషన్ కశ్మీర్– కన్యాకుమారి సైక్లింగ్ బృందానికి వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ మంగళవారం న్యూఢిల్లీలో ఘన స్వాగతం పలికింది. నషా ముక్త్ భారత్, ఆరోగ్యం, పిట్‌నెస్, జాతీయ ఐక్యత మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం ఈ సైక్లింగ్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు సభావట్ కళ్యాణ్ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత భారతదేశానికి ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన యువతే పునాది అన్నారు. యువత క్రీడలు, విద్య ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ రణదీప్‌రెడ్డి, సామాజిక కార్యకర్త గౌరవ్ పాటిల్ ఆయుష్ గుప్తా, గౌరవ్ టాండన్ పాల్గొన్నారు.
బషీరాబాద్: మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి మంగళవారం కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఘన్గాపూర్ పర్యటనలో భాగంగా కలబురిగిలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ భూ వివాదాలు, అంర్రాష్ట్ర రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. గతంలో మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న శరణుప్రకాశ్ పాటిల్ బషీరాబాద్ – కర్ణాటక సరిమద్దు ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. కాగ్నా నది జలాల వినియోగం,ఇక్కడ భూములున్న కర్ణాటక రైతులకు తెలంగాణలో రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహేందర్‌రెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రాంతీయ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, బిర్కట్ రఘు, బీదర్ రాజశేఖర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
దత్తత్రేయుడి సన్నిధిలో..
కార్తీక మాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహేందర్‌రెడ్డి మంగళవారం కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలోని ప్రసిద్ధ ఘన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


