జిల్లాలో నావంద్గీ, ఇందర్‌చెడ్, జీవన్గీ, ధోర్నాల్ పథకాల పునరుద్ధరణకు సర్కారు నిర్ణయం సాగులోకి రానున్న రెండు వేల ఎకరాల ఆయకట్టు మరమ్మతులపై క్షేత్రస్థాయిలో అధికారుల కసరత్తు రైతులతో అభిప్రాయాల సేకరణ
బషీరాబాద్: ఏళ్లుగా నిర్వహణకు నోచుకోక మూతబడిన ఎత్తిపోతల పథకాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఆయకట్టు రైతులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకుంటున్నారు. పథకాల ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన మరమ్మతులు, అవసరమైన నిధులపై వివరాలు సేకరిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే సు మారు 2 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
రెండు దశాబ్దాలుగా మూత
వ్యవసాయానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో 1974లో అప్పటి ప్రభుత్వం కాగ్నా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మించింది. బషీరాబాద్ మండలంలోని నావంద్గీ, ఇందర్‌చెడ్, జీవన్గీతోపాటు ధారూరు మండలంలోని దోర్నాల్ లో వీటిని చేపట్టింది. నది నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టు భూములకు సరఫరా చేయాలన్నది లక్ష్యం. తొలినాళ్లలో వీటి పరిధిలోని రెండు వేల ఎకరాల్లో రైతులు వరి, వేరుశనగ సాగు చేసేవారు. నిర్వహణ కోసం సాగునీటి సంఘాలూ ఉండేవి. అయితే క్రమంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు పథకాలను దెబ్బతీశాయి. విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో మోటార్లు పనిచేయడం మానేశాయి. భారీ యంత్రాలు మరమ్మతులకు నోచుకోక తుప్పుపట్టాయి. కాల్వలు పూడుకుపోయాయి. దీంతో పథకాలు నిరుపయోగంగా మారాయి. రైతులు సాగునీటి కోసం వర్షాలపైనే ఆధారపడుతున్నారు.
నావంద్గీలో 2012 వరకు..
నావంద్గీ ఎత్తిపోతల పథకం 2012 వరకు 550 ఎకరాలకు సాగునీరు అందించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కాల్వల మరమ్మతులకు రూ.8 లక్షలు మంజూరు చేయడంతోపాటు పంపు నుంచి కాల్వల వరకు కొత్త పైపులైన్ వేశారు. అయినా పథకం మళ్లీ మూతపడింది. దీంతో కొందరు రైతులు బోర్లు వేసుకోగా, మరికొందరు భూములను బీళ్లుగా వదిలేశారు. జీవన్గీ వద్ద రైతులు సొంత మోటార్లతో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. దిగువన కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాం బ్యాక్వాటర్తోనూ సాగు చేస్తున్నారు.
భారీగా బిల్లుల బకాయి
జిల్లాలోని నాలుగు ఎత్తిపోతల పథకాల విద్యుత్తు బిల్లుల బకాయిలు 2022 వరకే రూ.4.15 లక్షలు గా ఉన్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ఐడీసీ అధికారులకు సూ చించినా నిధుల కొరతతో బిల్లులు పేరుకుపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మోటార్లు కాలిపోగా, కొన్ని చోట్ల వాటి విడిభాగాలు సైతం మాయమయ్యాయి. పట్టించుకునేవారు లేక బావులు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి.
రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ
పునరుద్ధరణ చర్యల్లో భాగంగా అధికారులు ఆ యకట్టు రైతులతో రెండు రోజులుగా సమావేశమ వుతున్నారు.గతంలో ఎదురైన సమస్యలు, కాల్వ ల పరిస్థితి, నీటి సరఫరాలో ఇబ్బందులు, ప్రస్తు తం చేపట్టాల్సిన పనులపై చర్చిస్తున్నారు. వారి సూచనలను నమోదు చేసుకుంటూ పనుల ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. పంపుసెట్లు, మోటార్లు, పైపులైన్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థతోపా టు కాల్వల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎక్కడ మరమ్మతులు అవసరం?ఏయే పరికరాలను మార్చాలి? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.
నిధులపై అంచనాలు
నావంద్గీ, ఇందర్‌చెడ్, జీవన్గీతోపాటు దోర్నాల్ ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు అవసరమైన వ్యయంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపు, మోటార్ల మరమ్మతులు, కాల్వల నిర్మాణం, బావుల్లో పూడికతీత తదితర పనులకు ఎంత ఖర్చవు తుందో లెక్కిస్తున్నారు. ఎస్టిమేట్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తాండూరు ఇరిగేషన్ డీఈ బాలమోహన్ కృష్ణ తెలిపారు.
కదిలించిన ‘సాక్షి’ కథనాలు
ఎత్తిపోతల పథకాల దుస్థితిపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ‘లెఫ్ట్ ఇరిగేషన్’, ‘ఉత్తి పోతలే’, ‘ఎత్తిపోతలకు గ్రహణం’ వంటి శీర్షికలతో నిర్వహణ లోపాలు, పథకాలు మూతపడిన వైనం, రైతుల కష్టాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా ప్రభుత్వం పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పనులు త్వరగా ప్రారంభించి పూర్తిచేస్తే సాగునీటి కష్టాలు తీరుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పథకం.. ఆయకట్టు ఎకరాల్లో..
నావంద్గీ 550
ఇందర్‌చెడ్ 600
జీవన్గీ 600
దోర్నాల్ 250
మొత్తం 2,000
మూతబడిన ఎత్తిపోతల పథకాలకు పూర్వవైభవం


