ఆభరణాలు కాజేసి.. ఐరన్‌ బాక్స్‌తో బాదేసి | - | Sakshi
Sakshi News home page

ఆభరణాలు కాజేసి.. ఐరన్‌ బాక్స్‌తో బాదేసి

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

మీర్‌పేట: స్టాక్‌ మార్కెట్లో కోట్లలో నష్టం.. దీనికి ఆర్థిక సమస్యలు తోడయ్యాయి.. నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఓ మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశాడు.. అనంతరం ఆమెను హత్య చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన అరుణ్‌కుమార్‌ మిధానీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి మీర్‌పేట ధాతూనగర్‌ శ్రీ లక్ష్మీ రెసిడెన్సీలోని 3వ అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. ఇతనికి భార్య అనిత (34), కుమారుడు యశ్వంత్‌, ప్రగతి ఉన్నారు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న బీపీడీఏవీ స్కూల్‌లో చదువుతున్నారు.

హత్య జరిగిందిలా..

ఇదే అపార్ట్‌మెంటోని నాలుగో అంతస్తులో నివాసముంటున్న గడ్డ రాజ్‌కుమార్‌ (41) షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశాడు. కొంత కాలంగా షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ.4 కోట్ల వరకు నష్టపోయాడు. పలువురి నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోగా, చెక్‌బౌన్స్‌ కేసులు కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో అనిత ఒంటిపై ఉన్న నగలపై రాజ్‌కుమార్‌ కన్నుపడింది. ఎలాగైనా దొంగిలించాలని పథకం వేశాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో అనిత ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని గుర్తుపట్టకుండా హెల్మెట్‌ ధరించి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే అనిత తలను గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోగా, నోటికి ప్లాస్టర్‌ వేసి నగలు తీసుకున్నాడు. ఆమె స్పృహలోకి రాగానే గట్టిగా అరవడంతో పాటు రాజ్‌కుమార్‌ను ప్రతిఘటించడంతో తనను గుర్తుపట్టిందన్న అనుమానంతో పక్కనే ఉన్న ఐరన్‌ బాక్స్‌తో బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలింది. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన పిల్లలు తల్లి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి వెంటనే తండ్రికి తెలుపగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

నిందితుడు చిక్కాడిలా..

అనితను హత్య చేసి ఆభరణాలతో పారిపోయిన రాజ్‌కుమార్‌ నేరుగా పై అంతస్తులోని తన ఫ్లాట్‌కు వెళ్లాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తనపై అనుమానం కలిగి ఇంట్లోకి వచ్చి వెతికితే దొరికిపోతానని భావించి బయటకు వెళ్లి ఆభరణాలు పెట్టి వచ్చాడు. పోలీసులు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌తో పాటు రాజ్‌కుమార్‌ను ముందుగా విచారించగా తనకేమీ తెలియదని బుకాయించాడు. అనంతరం అతని శరీరంపై రక్తపు మరకలు గమనించి ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు అతని నుంచి మంగళసూత్రం, బంగారు గాజులు, ఉంగరం (మొత్తం 20 తులాలు) స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో సీఐ శోభన్‌, డిటెక్టివ్‌ సీఐ రవి, క్రైం సిబ్బంది ఉన్నారు.

మీర్‌పేటలో మహిళ దారుణ హత్య

స్టాక్‌ మార్కెట్లో రూ.కోట్లలో నష్టం

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు

పథకం ప్రకారం దోపిడీ.. అరవడంతో మర్డర్‌

పోలీసులకు చిక్కిన నిందితుడు

20 తులాల బంగారు నగలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement