● భారీగా తరలివస్తున్న భక్తులు
● వేడుకల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం
ధారూరు: మెథడిస్టు క్రిస్టియన్ జాతర వైభవంగా సాగుతోంది. మూడో రోజైన గురువారం ఉదయం నుంచే భక్తుల రాక ముమ్మరమైంది. కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, మహారాష్ట్రలోని బీజాపూర్, సోలాపూర్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీదర్ నుంచి వందలాది మంది కాలినడకన వేడుకలకు వస్తున్నారు. ఏసుక్రీస్తు ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేస్తూ, క్యాండిల్స్ వెలిగించి తన్మయత్వంలో మునిగిపోతున్నారు. జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో వాహనాలను నియంత్రించి, పార్కింగ్ స్థలాల్లోకి మళ్లిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.


