మర్పల్లి: భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల పరిధిలోని వీర్లపల్లిలో కొనసాగుతున్న సర్వేను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన వీబీజీరాంజీ పనులతో పాటు పెన్షన్ దరఖాస్తులు, వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సర్పంచ్ సుక్కారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఏ గ్రామం, ఏఏ సర్వే నంబర్లలో ఎప్పుడు సర్వే చేస్తారో ఒకరోజు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో ఎనభై శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన ఇరవై శాతాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందికి సహకరించాలని స్థానికులు, రైతులకు సూచించారు.
ఇంకుడు గుంతలు నిర్మించాలి
ప్రతీ వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు వీబీజీరాంజీ పథకంలో నీటి గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పనులు, చెక్‌డ్యాంలు, ఊట కుంటలు, సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ భవనాల వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. గ్రామంలోని మహిళా సమాఖ్య భవనం, పంచా యతీ భవనాలకు వీబీజీరాంజీ పథకం కింద ప్రహరీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి పెండింగ్ పనులు, చేయూత పింఛన్ దరఖాస్తులపై ఆరా తీశారు. అర్హులందరికీ పెన్షన్ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్, ఎంపీడీఓ శాంత, తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంఈఓ అశోక్, సర్పంచ్ చుక్కారెడ్డి, ఏపీఓ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ దివ్య, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి
వీర్లపల్లిలో సర్వే పనుల పరిశీలన
భూ భారతి, పెన్షన్ దరఖాస్తులపై ఆరా


