అక్రమ నిర్మాణాల జోరు! | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల జోరు!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

నోటీసులు ఇస్తున్నాం

● యథేచ్ఛగా లే అవుట్‌లు.. ఫాంహౌస్‌లు.. బహుళ అంతస్తులు

● పట్టించుకోని సంబంధిత అధికారులు

● నోటీసులతో సరిపెడుతున్న వైనం

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. జీవో 111ను తుంగలో తొక్కి యథేచ్ఛగా కట్టేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కంటి తుడుపు చర్యగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడిన మున్సిపల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అక్రమ లేఅవుట్లతోపాటు ఫాంహౌస్‌లు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. సురంగల్‌, ముర్తూజగూడ, పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్‌, అజీజ్‌నగర్‌, ఎనికేపల్లి, మొయినాబాద్‌, అప్పోజీగూడ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలో ఉండడంతో నిబంధనల ప్రకారం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, లేఅవుట్లు చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

మచ్చుకు కొన్ని

● సురంగల్‌ రెవెన్యూలో ఫాంహౌస్‌లు, విల్లాల నిర్మాణం జోరుగా సాగుతోంది. భారీ నిర్మాణాలతోపాటు లగ్జరీ ఫాంహౌస్‌లు, ఓ రిసార్ట్స్‌లో పదికి పైగా విల్లాలు నిర్మిస్తున్నారు.

● పెద్దమంగళారం రెవెన్యూలో సుమారు 150 ఎకరాల్లో ఓ భారీ అక్రమ లేఅవుట్‌ చేస్తున్నారు. ఎకరం, అర ఎకరం విల్లా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.

● పెద్దమంగళారం రెవెన్యూలో సుమారు 6 ఎకరాల్లో అక్రమ లేవుట్‌ చేశారు.

● చిలుకూరు రెవెన్యూలో జేబీఐటీ కళాశాల ఎదుట ఉన్న వెంచర్లలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ప్రైవేటు హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

● హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో బహుళ అంతస్తుల భవనాలు, విల్లాల నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది.

● చిలుకూరు, హిమాయత్‌నగర్‌, అప్పోజీగూడ గ్రామాల సమీపంలో గండిపేట చెరువు ఒడ్డున లగ్జరీ విల్లాల నిర్మాణం జరుగుతోంది.

● అజీజ్‌నగర్‌ రెవెన్యూలో పెద్దలు, ప్రముఖులకు చెందిన ఫాంహౌస్‌లు, విల్లాల నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

● ముర్తూజగూడ రెవెన్యూలో ఓ అక్రమ వెంచర్‌తోపాటు పలు ఫాంహౌస్‌ల నిర్మాణం చేపడుతున్నారు.

● ఎనికేపల్లి రెవెన్యూలో విల్లాలు, ఫాంహౌస్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది.

● పెద్దమంగళారం రెవెన్యూలో ఓ ప్రముఖ వ్యక్తి తన భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కొంత కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు.

చూసీ చూడనట్లు..

మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నిర్మాణాలకు కంటితుడుపు చర్యగా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. అధికారులు అక్రమ నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఓ ఓ నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

అక్రమ నిర్మాణాలు చేపడుతున్నవారికి కమిషనర్‌ ఆదేశాల మేరకు నోటీసులు ఇస్తున్నాం. పనులు ఆపాలని ఆదేశిస్తున్నాం. వరుసగా మూడు నోటీసులు ఇస్తాం. స్పందించని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటాం.

– రాములు, అసిస్టెంట్‌ టీపీఓ,

మొయినాబాద్‌ మున్సిపాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement