వేర్వేరు ప్రమాదాల్లో రెండు వాహనాలు అదుపు తప్పి పల్టీ కొట్టాయి. ఒక చోట వాటర్ బాటిల్స్, మరోచోట ధాన్యం బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. ఆయా ప్రమాదాల్లో మొత్తం ఎనిమిదిమంది గాయపడ్డారు.
చేవెళ్ల: వరి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన లారీ సిద్దిపేట జిల్లా నుంచి శనివారం వరిధాన్యం లోడ్‌తో రాయచూరు వెళ్తోంది. చేవెళ్లమీదుగా వెళ్తున్న సమయంలో షాబాద్ చౌరస్తాలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పట్నం మహేందర్‌రెడ్ది ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై లారీ, ధాన్యం బస్తాలు పడిపోవటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. పోలీసులు వచ్చి లారీని పక్కకు తీయించి క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బోల్తాపడిన లారీ
ఇబ్రహీంపట్నం రూరల్: సాగర్‌రహదారిపై ట్యాంకర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి ఓ డీసీఎం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. బొంగ్లూర్ నుంచి శనివారం ఇబ్రహీంపట్నం వైపు డీసీఎం (టీజీ 34టీ 1955) వాహనం వాటర్ బాటిల్స్ లోడ్‌తో వెళ్తోంది. మంగళ్‌పల్లి ఫైర్‌స్టేషన్‌కు కొద్ది దూరం వరకు రాగానే డివైడర్‌లో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్‌తో నీరు పోస్తున్నారు. డీసీఎం డ్రైవర్ అది గమనించకుండా వేగంగా వస్తున్నాడు. క్షణాల్లో అప్రమత్తమై డివైడర్ మీదకు ఎక్కించాడు. మూడు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి పల్టీ కొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. వాటర్‌బాటిల్స్ మధ్య 12 మంది కూలీలు చిక్కుకున్నారు. స్థానికులు గమనించి అందరినీ బయటకు తీశారు. వీరిలో ముఖేష్, సమర్‌సింగ్, శుక్‌సింగ్, ముఖేష్ కాస్రల్, హేమంత్‌సింగ్, సాయికుమార్‌కు గాయాలయ్యాయి. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి సృహతప్పి పడిపోగా స్థానికులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డుపై వాటర్‌బాటిల్స్ పడిపోవడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ క్రేన్ సాయంతో డీసీఎంను పక్కకు తప్పించారు. కాగా, రోడ్డుపై పడిపోయిన వాటర్ బాటిల్స్‌ను ప్రయాణికులు ఎగబడి తీసుకెళ్లారు.
సాగర్‌రహదారిపై
డీసీఎం బోల్తా
రోడ్డుపై పడిపోయిన వాటర్ బాటిల్స్
చేవెళ్లలో అదుపు తప్పిన లారీ..
కింద పడిన ధాన్యం బస్తాలు
వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు


