పండుగ సందడి
బషీరాబాద్: పేదల సొంతింటి కల సాకారమవుతున్న వేళ.. వారి ముంగిళ్లలో దీపావళి వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలోనో, బంధువుల ఇళ్లలోనో పండుగలు జరుపుకొన్న నిరుపేద కుటుంబాలు.. ఈసారి సొంతింట్లోనే సంబరాలు చేసుకోనున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆనందంలో పాలుపంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శనివారం జిల్లావ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి పండుగ జరుపుకోనున్నారు. ప్రభుత్వం రూపొందించిన పండుగ స్టిక్కర్లను ఇళ్లకు అతికించనున్నారు.
3,075 ఇళ్ల నిర్మాణం పూర్తి
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో వేగం పుంజుకుంది. నవంబర్ 7 నాటికి తొలి విడతలో జిల్లాకు మొత్తం 11,201 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 9,340 ఇళ్లకు మార్కౌట్ ప్రక్రియ పూర్తికాగా.. మరో 1,861 ఇళ్లకు మార్కౌట్ చేయాల్సి ఉంది. 3,163 ఇళ్లు ఆర్సీసీ దశను పూర్తి చేసుకోగా.. 3,075 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 6,238 ఇళ్లు ఆర్సీసీ, ఫినిషింగ్ దశల్లో ఉన్నాయి.
బాలంపేటలో సీఎం దీపావళి వేడుకలు
సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దౌల్తాబాద్ మండలం బాలంపేటలో ప్రత్యేకంగా నిర్వహించే ఇందిరమ్మ దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కటిక భారతిబాయి నివాసంలో జరిగే సంబరాల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించనున్నారు. పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమైన సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పండుగలో భాగస్వామి కానుండటంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అనంతగిరి: వికారాబాద్‌లోని పలు వార్డులతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల వద్ద శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు సందడి చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వీట్లు పంచడంతో పాటు టపాసులు పేల్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతగిరిపల్లిలోని ఓ ఇంట్లో నిర్వహించిన వేడుకల్లో మున్పిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, హౌసింగ్ ఏఈ శివశంకర్, వార్డు అధికారి శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు రెడ్యానాయక్ ఏఎంసీ డైరెక్టర్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గం మంజూరైన ఇళ్లు పూర్తయినవి
వికారాబాద్ 2,877 864
తాండూరు 2,808 532
పరిగి 2,844 1,007
కొడంగల్ 2,043 507
నవాబుపేట (చేవెళ్ల) 629 165
మొత్తం 11,201 3,075
నేడు జిల్లాలోని 3,075 నూతన గృహాల్లో వేడుకలు
పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఇంటింటికీ ప్రభుత్వ ప్రత్యేక స్టిక్కర్లు


