కేశంపేట: మండల పరిఽధిలోని పాపిరెడ్డిగూడ శివారు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. పోలీసులు శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాపిరెడ్డిగూడ శివారు నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను గుర్తించారు. ఆపి మట్టి తరలింపునకు సంబంధించిన వివరాలు అడగ్గా ఎలాంటి అనుమతి లేదని తెలిసింది. దీంతో టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ శ్రీశైలం, యజమాని సంతోష్‌పై పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.
పహాడీషరీఫ్: కార్మికుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రతాప్‌చంద్ర జేనా (48) తుక్కుగూడలోని రుబ్రీ తులీప్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పని చేసేందుకు ఈ నెల 3న వలస వచ్చాడు. పని నిమిత్తం బయటికి వెళ్లి వస్తానని అదే కంపెనీలో పనిచేసే తమ ప్రాంత వాసి భూషణ్ జేనాకు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో భూషణ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చేవెళ్ల: వీధి కుక్కల దాడిలో కొండగొర్రె (చౌసింగా) మృతి చెందింది. అల్లవాడ గ్రామ సమీపంలోని పొలాల వద్ద శనివారం కుక్కల దాడిలో చనిపోయి కనిపించింది. స్థానికులు గుర్తించి జింక అనుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అది జింక కాదని అడవుల్లో ఉండే కొండగొర్రె (చౌసింగా) అని పిలుస్తారని తెలిపారు. దారి తప్పి గ్రామాల వైపువచ్చి ఉంటుందన్నారు. పంచనామా చేసి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.
ధారూరు: మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు వ్యాపారుల రాక ప్రారంభమైంది. ఈనెల 10 నుంచి జాతర మొదలు కానున్న నేపథ్యంలో ముందుగానే చేరుకుని తమకు అనుకూలమైన స్థలాల్లో టెంట్లు, గుడారాలు వేసుకుని షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రంగుల రాట్నం, పిల్లలు ఆడుకునే సామగ్రి సిద్ధం చేస్తున్నారు.


