● శిలాఫలకంపై పేరు పెట్టలేదని గొడవ
● అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన ఓ వర్గం
● ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎదుటే గొడవపడిన నాయకులు
షాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగదాలు మరోసారి బయటపడ్డాయి. శిలాఫలకంపై పేరు పెట్టలేదనే కోపంతో అర్ధరాత్రి దానిని ఎత్తుకెళ్లడంతో మరుసటిరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎదుటే రెండు వర్గాల నాయకులు గొడవ పడ్డారు. మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమం జరగాల్సి ఉండగా శుక్రవారం అర్ధరాత్రి భవనం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మరో వర్గం నాయకులు ఎత్తుకెళ్లారు. శిలాఫలకంపై తమ నేతల పేర్లు లేకపోవడంతో కార్యక్రమం జరగకుండా చేశారు. అనంతరం మాచన్‌పల్లిలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎదుటే రెండు వర్గాల నాయకులు గొడవకు దిగారు. తమ పేర్లు శిలాఫలకంపై ఎందుకు పెట్టలేదని ఓ వర్గం అంటే.. అధికారులు ప్రొటోకాల్ ప్రకారం పేర్లు పెట్టారని మరోవర్గం వారు అంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. అనంతరం శిలాఫలకాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. రాజకీయంగా ఏదన్నా ఉంటే మాట్లాడాలని, అర్ధరాత్రి శిలాఫలకం ఎత్తుకెళ్లడం ఏమిటని సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ప్రశ్నించారు. ఇందుకు కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


