● తమ కొడుకును చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ
● ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
ఇబ్రహీంపట్నం రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని తరలించడంతో తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ ఎదుట రోదించారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొహెడ సమీపంలోని నిధి కన్వెన్షన్ హాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తల్లీకొడుకులు జ్యోతి, గజానంద్ (21) ఆరు నెలలుగా పని చేస్తున్నారు. జ్యోతి హౌస్‌కీపింగ్, గజానంద్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. భర్త సంజీవ దసరా పండగకు వచ్చాడు. భార్యాభర్తలు కలిసి శుక్రవారం దీపావళి పండగ కోసం స్వగ్రామానికి వెళ్లారు. అదే రోజు రాత్రి గజానంద్ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని కనిపించాడు. శనివారం ఉదయం మేనేజర్ విజయ్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. అప్పటికే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు వచ్చారు. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని తమ గోడు వినడం లేదని ఆరోపించారు. దీంతో ఊగిపోయిన ఎస్ఐ వారిని స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. తమ కొడుకుది ముమ్మాటికీ హత్యేనని, చనిపోయేంత పిరికివాడు కాదని, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని తల్లిదండ్రులు స్టేషన్ ఎదుట బోరున విలపించారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ కోరగా గజానంద్ ఆత్మహత్య కేసులో సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.


