అనంతగిరి: కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో మూడు రోజుల సీఎం పర్యటన, రైతు మేళా, ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రైతు మేళాకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అన్నదాతలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, ప్రజలు, రైతులకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, రవాణా, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లు, ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాల వివరాలను రైతులకు అందు బాటులో ఉంచాలన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, వీఐపీ రాకపోకలు, ప్రజల రాకపోకలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, జిల్లా వ్యవసాయాధికారి కవిత, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.


