న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
క్రమబద్ధీకరణ..
అప్పటికే కొన్ని భూముల ప్రక్రియ పూర్తి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పెండింగ్‌లో ఉన్న జీఓ నంబర్ 59 దరఖాస్తులకు మోక్షం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 500 గజాలలోపు ఆక్రమిత స్థలాలను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు జీఓకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేయకపోవడం, ఏ మండల పరిధిలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో రెండున్నరేళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని ఆరా తీస్తుండటంతో క్షేత్రస్థాయిలోని అధికారులు సైతం ఏమీ చెప్పలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి. జిల్లాలో 3,500 మందికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, హైదరాబాద్‌లో 1,300 వరకు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ తాజా ప్రకటన నేపథ్యంలో ఆయా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేసి మూడు వారాలు దాటినా ఇప్పటి వరకు జీఓ నంబర్ 59కు సంబంధించిన యాప్ ఓపెన్ కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిలిచిన ప్రక్రియ
ఒకవైపు క్షేత్రస్థాయి పరిశీలన, ఆమోదం, డిమాండ్ నోటీసుల జారీ, కన్వీనియన్స్ డీడ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు కలెక్టర్ లాగిన్‌లో మరో 3,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇదే సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, తర్వాత బీఆర్‌ఎస్ ఓటమి పాలై.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పటికే క్రమబద్ధీకరించిన భూములను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెజార్టీ లబ్ధిదారులు ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఉండటంతో ఈ అంశంపై పునరాలోచనలో పడింది. జీఓ నంబర్ 59 కింద ఉన్న ఆక్రమిత భూముల దరఖాస్తులకు మోక్షం కల్పించనున్ననట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పటి వరకు జీఓకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేయకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.
జీఓ నంబర్ 59పై ప్రభుత్వంలో కదలిక
దరఖాస్తులకు మోక్షం కల్పించాలని నిర్ణయం
తెరుచుకోని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ యాప్
పెండింగ్‌లో 3,500 అప్లికేషన్లు
ఆందోళనలో దరఖాస్తుదారులు
ప్రభుత్వ భూములను ఆక్రమించి, చేపట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసి, లబ్ధిదారులకు హక్కు పత్రాలను జారీ చేయాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022, 2023లో జీఓ నంబర్ 58 సహా 59ని తీసుకొచ్చింది. ఈ రెండు జీఓల కింద జిల్లా వ్యాప్తంగా 50 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. క్షేత్రస్థాయి తనిఖీలతోపాటు దరఖాస్తుల పరిశీలన, ఆమోదం కోసం వివిధ విభాగాలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 2014 జూన్ 2కు ముందు 125 గజాలలోపు ఉన్న ఆక్రమిత భూముల్లోని నిర్మాణాలను జీఓ నంబర్ 58 కింద ప్రభుత్వమే ఉచితంగా క్రమబద్ధీకరించింది. ఇక ఆక్రమిత ఖాళీ స్థలాలను జీఓ నంబర్ 59 కింద స్థానిక సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని ప్రకటించి, ఆ మేరకు అప్పట్లోనే కొంత మందికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. నిర్దేశించిన ఫీజుల చెల్లింపు తర్వాత కన్వీనియన్స్ డీడ్‌లను ఎస్‌ఆర్‌ఓలకు పంపి, ప్రభుత్వమే స్వయంగా ఆయా లబ్ధిదారుల పేరున రెగ్యులరైజ్ చేసింది.


