కందుకూరు: మండల పరిధిలోని లేమూరు సర్వే నంబర్ 102లోని 129 ఎకరాల భూమికి సంబంధించి భూసేకరణ కోసం గురువారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశపు హాల్‌లో భూసేకరణ కమిటీని ఏర్పాటు చేసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఆ భూమిలో ప్రభుత్వం టీజీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై అధికారులు, రైతుల మధ్య పరిహారం కోసం రెండో విడత చర్చలు నిర్వహించారు. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరాకు రూ.1.32 కోట్ల పరిహారంతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల ప్లాటును కేటాయిస్తామని అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.5 కోట్లు ఉందని, కనీసం రూ.2 కోట్లతో పాటు 2 ప్లాట్లు ఇవ్వాలని రైతులు కోరారు. రూ.1.35 కోట్లు ఇస్తామని అధికారులు తెలిపారు. కనీసం రూ.1.75 కోట్లు ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో భూములిచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రైతుల అభిప్రాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ వారికి చెప్పి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
పరిహారంపై తేల్చిచెప్పిన లేమూరు రైతులు


