యాచారం: భారత్ ఫ్యూచర్‌సిటీని సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అందులో భాగంగా ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రత్యేక మాస్టర్ ప్లాన్–2047ను రూపొందిస్తోంది. అందు కోసం పక్షం రోజుల పాటు డ్రోన్, శాటిలైట్ సర్వే చేపట్టింది. ఎఫ్‌సీడీఏ పరిధిలోని ఏడు మండలాలు 71 రెవెన్యూ గ్రామాలు, 873 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేపట్టారు. పది ప్రత్యేక బృందాలు, రాత్రి, పగలు తేడా లేకుండా డ్రోన్, శాటిలైట్ సర్వే చేపట్టారు. ప్రతి గ్రామంలో నాలుగు గుర్తులేసి (మార్కింగ్) శాటిలైట్, డ్రోన్ సర్వే పూర్తి చేశారు. మొదట్లో గ్రామాల్లో శాటిలైట్, డ్రోన్ సర్వే కోసం మార్కింగ్‌లు వేస్తుండగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. రోడ్లు నిర్మిస్తున్నారా.. బులెట్ రైల్ మార్గామా.. లేక మరేదైనా నిర్మిస్తున్నారా అని భయం పట్టుకుంది. సర్వే చేపట్టే సిబ్బంది కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడం, గ్రామాల్లో మార్కింగ్ ఎప్పుడు వేసి వెళ్తున్నారో తెలియక అయోమయం చెందారు.
రెండు హైవేల మధ్య..
సర్కార్ శ్రీశైలం–నాగార్జునసాగర్ హైవేల మధ్యన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో భారత్ ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తోంది. గత బీఆర్‌ఎస్ సర్కార్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల్లో మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆధునిక పట్టణ సౌకర్యాలు, రేడియల్ రోడ్డు, మెట్రో కనెక్టివిటీ, ఇతర భవిష్యత్తు ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిర్ణయించడం తెలిసిందే. 14 వేల ఎకరాల భూముల్లోనే కాకుండా తాజాగా యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నందివనపర్తి, నస్దిక్‌సింగారం, చింతపట్ల తదితర గ్రామాల్లోని దాదాపు మరో ఐదు వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి సర్కార్ శరవేగంగా పావులు కదుపుతోంది. మొండిగౌరెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో అసైన్డ్ భూమి సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్లు వేసిన సర్కార్ మిగితా గ్రామాల్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
నివేదిక ప్రభుత్వానికి అందజేత
ఎఫ్‌సీడీఏ పరిధిలో చేపట్టిన డ్రోన్, శాటిలైట్ సర్వే నివేదికను ఇటీవల సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధుల బృందం సర్కార్‌కు అందజేసినట్లు తెలిసింది. ప్రత్యేక మాస్టర్ ప్లాన్–2047 ప్రకారం ఎఫ్‌సీడీఏలోని గ్రామాల్లో ఎంత జనాభా పెరిగే అవకాశం ఉంటుంది.. ఏ మేర కు అభివృద్ధి పనులు చేపట్టాలి.. భవిష్యత్తు నగరి కోసం ఏ మేరకు సౌకర్యాలు కల్పించాలనే దానిపై నివేదిక అందజేసినట్లు సమాచారం. ఎఫ్‌సీడీఏ సమగ్ర మాస్టర్ ప్లాన్– 2047తో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో విశ్వాసం నెలకొంది. అదే తరహాలో పన్నుల రేట్లు అధికంగా పెరిగే అవకాశం లేకపోలేదని చర్చించుకుంటున్నారు.
ఏడు మండలాలు, 71 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్, శాటిలైట్ సర్వే
పక్షం రోజులుగా పది ప్రత్యేక బృందాలతో పూర్తి
ప్రభుత్వానికి నివేదించిన ప్రతినిధుల బృందం?


