షాద్‌నగర్: మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య ఆధ్వర్యంలో ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు షాద్‌నగర్ సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అనుబంధ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో హెల్త్‌నెట్ పరిధిలో పని చేసేందుకు మొత్తం పది ఆరోగ్యమిత్ర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కంప్యూటర్‌లో పీజీడీసీఏతో పూర్తి చేసిన వారితో పాటు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆరోగ్య సంస్థల్లో విధులు నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పోస్టులకు ఎంపికై న వారు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలోని ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ విధానం కింద షిఫ్టుల వారీగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 సాయంత్రం 5గంటల వరకు షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలు, పని అనుభవం పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 96400 94832 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించిన వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలవనున్నట్లు తెలిపారు.
తుర్కయంజాల్: చెరువులు, కాలువలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఇరిగేషన్ డీఈ విజయేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఏఈలతో కలిసి తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు కాలువలు, దిలావర్ ఖాన్ చెరువు కాలువలను పరిశీలించారు. ఈ రెండు చెరువుల కాలువలు పలుచోట్ల అన్యాక్రాంతం అయినట్లు గుర్తించినట్టు తెలిపారు. అదేవిధంగా అపిల్ అవెన్యూ కాలనీలో వాగుపై నిర్మించిన కాలువ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.
షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షాద్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన అసోసియేషన్ సభ్యులను ఎన్నుకున్నారు. కరుణాకర్‌ను గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యలో అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనను అసోసియేషన్ సభ్యులు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా సన్మానించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అఽధికారి ఎస్.స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. శంషాబాద్ మినీ స్టేయంలో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీయువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో తక్కువ ఫీజుతో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 12 బ్యాచ్‌ల శిక్షణ విజయవంతంగా పూర్తయిందన్నారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


