ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నేరుగా అర్జీలు స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరా, పశువుల సంరక్షణ, వైద్య శిబిరాల నిర్వహణ, వ్యవసాయ ప్రణాళిక, విద్యుత్ సరఫరా అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రబీ సీజన్‌లో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కరపత్రాలు, పోస్టర్లు, ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు చేయాన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఓవర్‌లోడ్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తాం
పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పెండింగ్ దరఖాస్తులపై, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, స్పష్టమైన కారణాలతో కూడిన స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని తెలిపారు. అనవసర జాప్యాన్ని నివారిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేపడతామని, సమన్వయంతో పని చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం అధికార రవీంద్రగుప్తా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


