తుర్కయంజాల్: డెంగీతో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా ముదిగొండకు చెందిన జర్పుల కిషన్, జ్యోతి దంపతులు రాగన్నగూడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు వినూత్ (13)కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక తార చిల్డ్రన్స్ అండ్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. పరీక్షల్లో డెంగీ ఫీవర్ ఉన్నట్లు తేలిందని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఒక్కసారిగా బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి నగరంలోని మరో ఆస్పత్రికి వెళ్లే సరికి బాబు మృతి చెందాడు. దీంతో వారు తిరిగి తారా హాస్పిటల్ వద్దకు బాలుడి మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు ఒక్కసారిగా హాస్పిటల్ లోపలికి ప్రవేశించి పూల కుండీలతో పాటు, పలు వస్తువులను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడికి యత్నించారు. బాలుడి మృతికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యంతో పాటు, వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ ప్రదీప్ రెడ్డితో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
● వైదుల్య నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
● మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన


